Monday, October 23, 2023

కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కుజగ్రహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

కుజుడు సామాన్యునిలో ఉత్తేజాన్ని, హంతకునిలో హింసను, బాలునిలో భయాన్ని, ప్రేమికునిలో రక్తిని, కార్మికునిలో శ్రమశక్తిని ఉత్తేజపరుస్తుంది.

కుజదోషాన్ని పూర్వం ఆడవారికి మాత్రమే చూసేవారు. కుజుడు ప్రధమ భావంలో జలరాశిలో ఉంటే స్త్రీ లోలుడు, మద్యపాన ఆశక్తి కలవాడు అవుతాడు.

కుజుడు షష్ఠం లో ఉంటే తొందరగా, హడావుడిగా మాట్లాడతారు. జాతకంలో కుజుడు దోషి అయినప్పుడే అతనికి దోషం అవుతుంది. యోగ కారకుడైన కుజదృష్టి గుణప్రదమే అవుతుంది.

మకరరాశిలో సూర్య, చంద్రులు ఉండి కుజ ప్రభావం ఉంటే మోకాలు సమీపంలో అనారోగ్యాలు గాని దెబ్బలు గాని తగిలే అవకాశాలు ఉన్నాయి.

శిరస్సుకు కారకుడైన కుజుడు పాపగ్రహ ప్రభావానికి లోనయితే శిరస్సుపై దెబ్బలుంటాయి. కుజుడు లగ్నం నుండి ఏ భావంలో ఉన్నాడో చూసి ఆ భావానికి సంబందించిన శరీర స్దానంలో కాని అతడున్నరాశికి చెందిన శరీరభాగంలో గాని చిహ్నం ఉంటుంది. శరీరంలో దక్షిణ భాగంలో పుట్టుమచ్చ లేదా చిహ్నమునకు కుజుడు కారకుడు.

కుజుడు వెనుక నుండి ఉదయిస్తాడు కావున కుజగ్రహ ప్రధానుడైన వ్యక్తి ఎదుటి వారి మాటలను మరోకోణంలో ఆలోచిస్తాడు.

కుజుడు శని లగ్నంలో ఉండగా ఈ స్ధానం పై గోచార రవి సంచారం చేస్తున్నప్పుడు దుర్ఘటనలు కలిగే అవకాశాలు ఉంటాయి.

కుజుడు, శుక్రులు కలసి ద్వితీయంలో ఉంటే యుక్త వయస్సులోనే పళ్ళు ఉడిపోవటం, పుచ్చిపోవటం జరుగుతుంది.

కుజుడు వ్యయంలో ఉంటే ఋణాను బంధాలను తీర్చుకోవటానికి మళ్ళీ మానవ జన్మ ఎత్తుతారు.

చంద్రాత్ కేంద్రగతే భౌమే యోగో మంగళ కారకః
మంగళాఖ్యే సరోజాతః నిత్య శ్రీర్నిత్య మంగళం

ఈ శ్లోకం ఆదారంగా చంద్రునకు సప్తమ కేంద్రంలో కుజుడు ఉన్నప్పుడు చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది. ఇట్టి యోగమున్న జాతకులకు కుజదోషం ఉండదు. ఈ యోగ జాతకులు నిత్య లక్ష్మీ కటాక్షం ఉన్నవారుగా, నిత్యం శుభములు పొందేవారుగా ఉంటారు.

గురు మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే
చంద్ర మంగళ సంయోగే కుజదోషోనవిద్యతే

శుక్లపక్ష చంద్రుడితో కుజుడు కలసి ఉన్న, కుజునిపై గురుదృష్టి ఉన్న కుజదోషం ఉండదు.

కుజదోషం ఉన్న వారిని కుజదోషం ఉన్న వారికే ఇచ్చి వివాహాం చేయాలనుకోవటం వల్ల దోషం పరిహారం కాదు. ఒక దోషం ఒక జాతకంలో ఉన్నప్పుడూ పరిహారాలు చేసుకోవటం శాస్త్రీయం. దోషం గల మరియొక జాతకునితో వివాహాం చేయటం వలన దోషం బలపడుతుండే గాని దోషం నశించదు. దోష నివారణకు వైధవ్య దోష పరిహారకములైన వ్రతాదులు చేసుకోవలయును.

దర్మశాస్త్రాలు కూడ వైధవ్య యోగాదులకు శాంతి విధానాలనే బోధిస్తున్నాయి. విశిష్టమైన జ్యోతిష్య గ్రంధాలలో కూడ ఒక జాతకమందలి ఒక దుష్టయోగం మరియొక శుభయోగం వలనే పరిహారం అవుతాయని భోదిస్తున్నాయి. తప్ప ఒక జాతకము నందలి దుష్టయోగం మరియొక జాతకమందలి దుష్టయోగం చేత పరిహారింపబడుటలేదు. గాంధారికి వైధవ్యయోగం ఉందన్న కారణం చేత ధర్మ శాస్త్ర విహితమైన మార్గంలో ఆ దోషాన్ని తొలగించి వివాహాం చేశారని భారత సారం అనే గ్రంధం తెలుపుతుంది.

జాతకమందలి వైధవ్య యోగం ఉన్నప్పుడు సావిత్రీ వ్రతం గాని, పిప్పల వ్రతం గాని చేయించి జాతకంలో దీర్ఘాయువు గల వరునితో వివాహం చేయాలి.