Tuesday, February 27, 2024

శ్రీ సుభ్రమణ్య తత్వము


శ్రీ సుభ్రమణ్య తత్వము : 
చెడుపై మంచి విజయం సాధించాలంటే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అవసరము. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి సుబ్రహ్మణ్య తత్వం బోధించడంలో రహస్యం ఏమిటంటే సుబ్రహ్మణ్యుని శక్తిని కూడా రాముడిలో ప్రవేశ పెట్టడమే విశ్వామిత్రుల వారి ఆంతర్యము షణ్ముఖుడి ఆరు ముఖాలు పంచ భూతాలను + ఆత్మను సూచిస్తాయంటారు. ఇంకా అవి యోగ సాధకులకు షట్చక్రాలకు సంకేతాలు వేదాలలో షణ్ముఖీయమైన సంవత్సర స్వరూపంగాస్వామిని వర్ణించారు.
కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్నిరుద్రుడైన శివుని తేజమే ఈసంవత్సరాగ్ని.ఆరు ముఖాలను ఆరు ఋతువులకు ప్రతీకగా, పన్నెండు చేతులను పన్నెండు మాసాలకు ప్రతీకలుగా చెప్పుకోవచ్చు. ఇదీసంవత్సరాగ్ని రూపం.ఈ రూపం చిత్రాగ్ని అనే నెమలిపై ఆసీనమయ్యింది. వివిధ వర్ణాలను వెదజల్లే కాంతి పుంజమే ఈ నెమలి.

సుబ్రహ్మణ్య స్వామియజ్ఞ తత్వమునకు ప్రతీక, అలాగే శ్రీ మహావిష్ణువు కూడా యజ్ఞ పురుషుడిగానూ, యజ్ఞతత్వమునకు ప్రతీక గానూ విష్ణు సహస్ర నామాలలో అభివర్ణించబడింది. అందులోనే శ్రీమహావిష్ణువుకి "స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః" అనే నామాలు ఉన్నాయి, అంటే స్కందుడు అన్నా, సుబ్రహ్మణ్యుడు అన్నా, మహావిష్ణువు అన్నా ఒకటే తత్వం అని అర్ధం.

అందరు స్త్రీలలోను తన తల్లి మూర్తీభవించి ఉంది కనుక తాను ఇక ఎవరినీ పెళ్ళాడలేను అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా వుండి పోయారు ఉతిత కుండలినీ శక్తికి ప్రతీకగా సుబ్రహ్మణ్యుడిని సర్పరూపంలో ఆరాధిస్తారు.

సుబ్రహ్మణ్యస్వామి వారి ఇద్దరు భార్యలు అంటే ఇక్కడ లౌకికమైన భార్యలు అని కాదు. వల్లీ దేవి అమ్మ వారు కుండలినీ శక్తికి ప్రతీక. ఆ శక్తి చలనానికి ఆగమనంలో ప్రాకే నాథశక్తికి ప్రతీక వల్లీ దేవి అమ్మ. మనందరిలోనూకుండలినీ శక్తి మూడున్నర అడుగుల చుట్ట చుట్టుకుని మూలాధార చక్రములో ఉంటుంది.అయితే ఆ కుండలినీ శక్తిని జాగృతం చేయడం సమర్దుడైన గురువు పర్యవేక్షణలో తప్పఎవరూ సొంత ప్రయోగాలు చేయకూడదని పెద్దలు చెప్తారు. ఇక దేవసేనా అమ్మ వారు అంటే, ఇంద్రియశక్తులే దేవసేన. కాదు కాదు సకల సృష్టిలో ఉన్న శక్తికి ప్రతీక. వల్లీదేవి, దేవసేనాఅమ్మలు ఇద్దరూ చైతన్య స్వరూపుడైన సుబ్రహ్మణ్యుడికి పత్నులు.