Friday, February 16, 2024

రథ సప్తమి శుభాకాంక్షలు

🌺రధసప్తమి_శుభాకాంక్షలు🌺

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

రధసప్తమి పవిత్రమైన దినం. ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి. ఈ దినాన అరుణోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.

ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు, రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి - అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఈ సప్తమి సూర్యగ్రహణంతో సమానం.

_*"సూర్యగ్రహణ తుల్యాతు శక్లామాఘస్ సప్తమీ"*_

ఆకారణం చేత ఈ రోజున సరియైన గురువునుండి, మంత్రదీక్షలు తీసుకొన్నా, కొత్త నోముు పట్టినా విశేషఫలం ఉంటుంది. తమకు ఉపదేశింపబడ్డ మంత్రాలను అధిక సంఖ్యలో అనుష్ఠించడానికి అనువైన సమయమిది.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు చదువ వలసిన శ్లోకాలు:

నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః
అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!
యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు!
తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్!
మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!
సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, శోకాలు నశిస్తాయి.

1. ఈ జన్మలో చేసిన, 
2. జన్మాంతరాలలో చేసిన, 
3. మనస్సుతో, 
4. మాటతో, 
5. శరీరంతో, 
6. తెలిసీ, 
7. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉన్నది.

చందనంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక - అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని అర్చించడం విశిష్టమైనది.

ఆవు పేడ పిడకలను కాల్చి ఈ వేడిలో క్షీరాన్నాన్ని వండి సూర్యునికి నివేదించాలి. ఆ క్షీరాన్నాన్ని చెరుకు ముక్కలతో కలుపుతూ ఉండాలి. దానిని చిక్కుడు ఆకులలో ఉంచి నివేదిస్తారు. చిక్కుడు, జిల్లేడు, రేగు - పత్రాలలో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది.

జననీ సర్వలోకాకే సప్త వ్యాహృతికే దేవి
నమస్తే సూర్యమండలే - అని సప్తమీ తిథి దేవతని సూర్యమండలాన్ని నమస్కరించాలి. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, తామ్రపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.

 తిథులలో సప్తమి తిథికి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. ఏడవ తిథి సప్తమి. అలాగే సప్తమి తర్వాత వచ్చే తిథి అష్టమి. అష్టమి మొదలుగా చంద్రునకు రిఫ అనే దోషము కూడా ఆపాదింప బడుతుంది. సప్తమి తిథి పూర్తి కావడంతో వచ్చే గుణగణాదులు పూర్తిగా మారిపోతాయి అష్టమి తిథితో. అందుకే ఈ సప్తమి తిథికి శరీరానికి ప్రాతినిధ్యం వహించేటటువంటి, తను భావ కారకుడైనటువంటి, పిత్రుభావ కారకుడైనటువంటి సూర్య నారాయణ మూర్తి యాజమాన్యాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి ఈ సూర్య నారాయణ మూర్తి పుట్టినటువంటి రోజు మాఘ శుద్ధ సప్తమి. దీనికి సూర్యసప్తమి అని పేరు. అలాంటప్పుడు రథసప్తమి అన్న పేరు ఎలా వచ్చింది? మిగతా ఏ పండుగలకూ లేని ప్రత్యేకత రథసప్తమికి ఎలా ఏర్పడింది? అంటే సూర్య నారాయణ మూర్తి ప్రత్యేకంగా ఆయన రథం చెప్పుకోదగ్గది. ఆయన రథానికి ఒకటే చక్రం ఉంటుందిట. ఒక చక్రం ఉండే రథం ప్రపంచంలో ఉంటుందా? రెండు చక్రాలు కావాలి కదా మనం వెళ్ళాలి అంటే. సూర్యుని రథం మటుకు ఒకే చక్రం. నిర్ణీతమైన ప్రమాణంలో ప్రపంచంలో ఏం జరిగినా క్రమం తప్పకుండా ప్రయాణించేటటువంటి వాడు సూర్య నారాయణుడు. కనుక ఆ సప్తమి రథసప్తమి, సూర్య సప్తమి. "దుర్ముఖ నామ సంవత్సరే ఉత్తరాయనే శిశిర ఋతౌ మాఘమాసే శుక్లపక్షే సప్తమ్యాం కృత్తికా నక్షత్రే కళింగ దేశాధిపతిం " అంటూ సూర్య నారాయణ మూర్తి వృత్తాంతం అంతా కూడా నవగ్రహార్చన చేసే సమయంలో చెప్తూ ఉంటారు.

 ఆ స్వామి కృత్తికా నక్షత్రంలో జన్మించాడు అని వర్ణిస్తాయి సాంప్రదాయ గ్రంథాలన్నీ కూడా. దక్షిణాయనం పూర్తీ అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన సంక్రాంతి పిమ్మట వచ్చే సప్తమి తిథికి రథసప్తమి అని గుర్తించాలి. ఇకనుంచి సంపూర్ణమైన కాంతి కిరణాలు మనపైన ప్రసరిస్తాయి ఉత్తరాభిముఖంగా. కనుక ఈ తిథి నాడు సూర్య రథాన్ని ప్రతిబింబించే విధంగా వాకిళ్ళలో సూర్య రథం ముగ్గు వేయడం, అలాగే సూర్య నారాయణ మూర్తిని సోత్రం చేయడం, చేయాలి. ఇంతటి ప్రాముఖ్య కలిగిన రోజు రథసప్తమి రోజు. సూర్య నారాయణ మూర్తిని ఆరాధన చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది.
_______________________________

🌹సూర్యుని ఎందుకు ఆరాధించాలి?🌹

1. ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు

భగవంతుడు లేడని అనేవారు ఉండచ్చుగానీ, వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. జాతి, మత, దేశబేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకూ, సిద్ధాంతాలకూ అతీతంగా అందరికీ, అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. అందుేక ఆయన ప్రత్యక్ష దైవం, లోకసాక్షి, జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండదు. ఆ స్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదు.

2. ప్రపంచవ్యాప్తంగా సూర్యారాధన

ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుని భక్తభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచమంతటా ఉంది. జీవుల ఉనికికీ, మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. సూర్యుడు దక్షినాయనం ముగించుకుని ఉత్తరాయనం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి, రెండవది రథసప్తమి. సప్తమి సూర్యుని జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది. నిస్వార్ధకర్మకు తిరుగులేని ఉదాహరణ సూర్య భగవానుడు. సర్వసమత్వానికి కూడా ఆయన విశిష్ట ప్రతీక. పూరి గుడిసెమీద, రాజసౌధం మీద ఒకే విధంగా వెలుగు కిరణాలను ప్రసరింపజేస్తాడాయన. పేదవాడిలోనూ ధనికునిలోనూ కూడా ఒకే విధంగా చైతన్యాన్ని నింపుతాడు. విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికి ఆదర్శం. ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడు. సృష్టిలోని సంపదకు, విద్యావిజ్ఞానాలకు ఆయనే మూలపురుషూడు.

3. సూర్యుడికి సంబంధించిన పురాణ కథలు

సూర్యుని వల్లనే సంపద కలుగుతోందనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు, మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. అప్పుడు సూర్యుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. ఆ అక్షయపాత్ర అక్షయం గా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రాజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమనే మణిని పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.

4. సూర్యుడే జ్ఞానానికి ఆది దేవుడు

వెలుగే జ్ఞానం. విద్యావివేకాలకూ, బుద్ధి వికాసానికీ వెలుగే మూలం. ఆ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు వేదశాస్త్రాది విద్యలన్నింటిలో నిష్ణాతుడు. సూర్యుని దగ్గరే ఆంజనేయుడు వేద శాస్త్రాలను అభ్యసిస్తాడు. బుద్ధిని ప్రేరేపించే వాడు సూర్యుడేనని చెబుతుంది గాయత్రీమంత్రం. ఇహానికీ, పరానికీ కావలసినవన్నీ మనకు సూర్యునినుంచి అందుతున్నాయి. జీవుల పుట్టుక పోష ణకూ అవసరమైనవన్నీ సూర్యునివల్లే అభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే. ఆ మనుస్సును నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రునికి ప్రకాశాన్ని అందించేవాడు సూర్యుడు

5. సూర్యారాధన ప్రాముఖ్యత

ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే అంతటికీ, అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషూలు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు. సూర్యయోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడే గురువనీ, సూర్యకాంతే జ్ఞానమనీ చెబుతారు. శరీరంలో 24 తత్వాలుంటాయనీ, సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందనీ వీరంటారు. పంచ భూతాలలో ఆకాశమూ, అగ్నీ ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు, వేడి పుడుతున్నాయి. మన శరీరంలో ఉన్న ఆరు చక్రాలను వెలుగు పైనుంచి కిందికి చైతన్యవంతం చేస్తుంటే, శబ్దం కిందినుంచిపైకి చైతన్యవంతం చేస్తూ ఉంటుంది. శబ్ధానికి కొన్ని పరిమితులున్నాయి. శబ్ద ప్రసారానికి ఏదైనా మాధ్యమం అవసరమవుతుంది. వెలుగు అపరిమిత మైనది. కాంతి ప్రసారానికి ఎటువంటి మాధ్యమమూ అవసరంలేదు. వెలుగు అన్నింటికంటె వేగంగా పయనిస్తుంది. ఋషులు, యోగులు ఎంతోకాలంపాటు నిరాహారులుగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించేవారుంటారు. పంచభూతాలతోకూడిన ప్రకృతి, ఆ ప్రకృతిలోని భాగమైన మనమూ, మన శరీరంలోనే నిద్రాణంగా ఉన్న అపారశక్తులనూ, వాటిని మేలు కొలిపే ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్యనమస్కారాలు, ఆసనాలవల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కలిస్తుంది. శరీర, ప్రాణ, మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెరచుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. అంటే భోగశరీరం యోగ శరీరంగా మారి పోతుంది. అప్పుడు అపారమైన శాంతి, సమస్థితి కలుగుతాయి.

6. సూర్య చికిత్స ప్రతిభ

సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. ఈ రంగుల ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని ప్రవేశపెట్టారు. నారింజరంగు వేడిని కలిగించి శైత్యసంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. జీర్ణ ప్రక్రియను బాగు చేస్తుంది. శీతల స్వభావం కలి గిన ఆకుపచ్చ రంగు కండపుష్టిని కలిగించి మెదడును పటిష్ఠపరుస్తుంది. కీళ్ళనొప్పులవంటి రుగ్మ తలను పోగొడుతుంది. నీలిరంగు కూడా శీతల స్వభావం కలిగి ఉండి పిత్తదోషం వల్ల కలిగే రోగా లను నివారిస్తుంది. ఈ మూడు రంగులను ప్రధాన వర్ణాలుగా స్వీకరించి మిగిలిన రంగుల సమ్మే ళనంతో మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయో గిస్తారు. సూర్య నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్య కిరణాలుమన ఆలోచనా ప్రక్రియను శుద్ధి చేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. సాధారణ మానవ చైతన్యంతో నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా నియంత్రితమవుతుంది. మన ఇంద్రియాలు ఎప్పుడూ బయటికే తిరిగి ఉంటాయి. మన ఆలోచనలు బాహ్యంలోనే పరిభ్రమిస్తూ ఉంటాయి. అందుకే మనలోవలే ఉన్న అజ్ఞాతశక్తుల గురించి మనకు తెలియదు. అలా తెలియ కుండా చేసేదే మాయ. ‘నేను ఎవరు?’ అని ప్రశ్నించుకుని ఒక్కసారి మన ఆలో చనను, చూపును లోపలికి మరలించు కున్నామంటే అసలు సత్యం బోధపడి ఆశ్చర్యం కలుగుతుంది. వెలుపలి సూర్యునికంటె వేయిరెట్లు ఎక్కువ కాంతితో వెలిగిపోయే సూర్యుడు మనలోపలే ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకాలు కూడా మనలోపలే ఉన్నాయి. ఈ విషయం మనం తెలుసుకోకుండా మాయ అడ్డపడుతూ ఉంటుంది. సాధనతో అడ్డును తొలగించుకుంటే విశ్వ చైతన్యంలో మనం భాగమని అర్థమవుతుంది.