Friday, October 25, 2024

వృశ్చిక  రాశి లో బుధ సంచారం 29. 10. 2024 నుండీ 04. 01. 2025 వరకు 

 


ప్రస్తుతం తులా రాశి లో సంచారం చేస్తున్న బుధుడు , 29.10.2024 న వృశ్చిక రాశి లో ప్రవేశిస్తాడు.

మామూలుగా ఒక రాశి లో 15 నుండీ 17 రోజులు సంచారం చేసే బుధుడు ఈ సారి వృశ్చిక రాశి లో 66 రోజుల పాటు వుంటాడు.
అంటే 29.10.2024 నుండీ 04.01.2025 వరకు వృశ్చిక రాశి లో నే బుధుడు వుంటాడు.
మధ్యలో 26.11.2024 నుండీ 16.12.2024 వరకు వక్ర గతి లో వుంటాడు.
నైసర్గిక రాశి చక్రం లో 8 వ రాశి అయిన వృశ్చిక రాశి చాలా నిగూఢమైనది . చాలా రహస్యాలు దాచుకున్న రాశి.
బుద్ధి కారకుడైన బుధుడు ఈ రాశిలో ఎక్కువ కాలం వుండడం వల్ల చాలా రహస్యాలు వెలుగులోకి వొచ్చే అవకాశం వుంది.
వృశ్చిక రాశిలో నే వక్ర గమనం లో వున్నప్పుడు ప్రకృతి వైపరీత్యాల ఎక్కువగా వుంటాయి.
వక్రము చెందిన బుధుడు విపరీత ఫలితాలను ఇస్తాడని గర్గ , కాశ్యప మహర్షులు చెప్పినట్లు భట్టోత్పల వ్యాఖ్య.

శ్లో: నోత్పాత పరిత్యక్తః కదాచిదపి చంద్రజో వ్రజత్యుదయమ్
జల దహన పవన భయకృత్ ధాన్యార్ఘ క్షయ వివృద్ధౌ

పై శ్లోకం బుధ చారం గురించీ చెప్తూ వరాహమిహిరుడు బృహత్ సంహిత లో చెప్పిన మొదటి శ్లోకం.
పై శ్లోకం తాత్పర్యం: చంద్రుని కుమారుడైన బుధుడు ఉత్పాతములు లేనిదే ఉదయించడు. బుధోదయము జరిగినప్పుడు జల అగ్ని వాయు భయములునూ దాన్యాధికముల ధరలు హెచ్చు తగ్గులగుటయూ,ధాన్య నాశనమునూ జరుగు చండునని పై శ్లోకం లో చెప్పబడింది .

శ్లో : హస్తాదీని చరన్ షడృక్షాణ్యుపపీడయాన్ గవామ శుభః
స్నేహ రసార్ఘ వివృద్ధిం కరోతి చొర్వీ ప్రభూతాన్నమ్
(బృహత్ సంహిత)

పై శ్లోకం లో హస్తా నక్షత్రం మొదలు జ్యేష్టా నక్షత్రం వరకూ బుధుడు సంచరిస్తున్నప్పుడు , గోవులకు అశుభమూ, తైలాది రస ద్రవ్యముల ధరలు హెచ్చుటయూ, అన్నమూ మొదలగు ద్రవ్యముల సమృద్ధి గా వుండుననియూ చెప్పబడింది.

మొత్తం మీద రాబోయే బుధుడి వృశ్చిక సంచారం లో ఈ కింది ఫలితాలు వుండొచ్చు -
1.పెట్రోల్, డీజిల్ , వంట నూనె ల ధరలు పెరుగుతాయి.
2. ధాన్యం సమృద్ధి గా వున్నా ధరలు పెరుగుతాయి.
3. జల తత్వపు రాశిలో బుధ వక్ర గమనం వల్ల అకాల వర్షాలు , వరదలు వల్ల నష్టాలు వుంటాయి.
4. ఎప్పటి నుండో దాచి ఉంచిన రహస్యాలు అనూహ్యం గా వెలుగు లోకి వస్తాయి.
5. సాహిత్య రంగంలో ప్రముఖులకి ప్రమాదం
6. నవంబర్ 30 అమావాస్యకు దగ్గరలో ప్రకృతి వైపరీత్యాలు
7. కమ్యూనికేషన్ వ్యవస్థల్లో ప్రమాదాలు, అంతరాయాలు.
8. సముద్ర గర్భం లో వున్న కేబుల్స్ తెగి ఇంటర్నెట్ కి అంతరాయం కలగొచ్చు.