Friday, August 28, 2020

కలియుగ వాలి - డొనాల్డ్ ట్రంప్ - జాతక పరిశీలన

కలియుగ వాలి - డోనాల్డ్ ట్రంప్ - జాతక పరిశీలన 

అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ గారి పుట్టిన తేదీ ,సమయం బర్త్ సర్టిఫికెట్ ప్రకారం ఖచ్చితమైన సమాచారం ఇంటర్నెట్ లో దొరుకుతోంది . ఈయన జాతకం పరిశీలిస్తే చాలా  ప్రత్యేకతలు కనపడతాయి . ట్రంప్ గారి జాతక చక్రం ఈ క్రింద ఇవ్వబడినది . 
వీరిది సింహ లగ్నం. సింహ లగ్నానికి యోగ కారకుడు, బాధకుడు  కుజుడు  లగ్నం లో నే వున్నాడు.   లగ్నాధిపతి రవి రాహుగ్రస్తుడై దశమం లో, చంద్రుడు కేతుగ్రస్తుడై చతుర్ధం లో వున్నారు. శని,శుక్రులు కర్కాటకం లో నూ ,ఏకాదశాధిపతి బుధుడు ఏకాదశం లో నూ వున్నారు . పంచమ అష్టమాధిపతి బృహస్పతి  ద్వితీయం లో స్థితుడై వున్నాడు.  ఈ రకం గా వున్నా గ్రహ స్థితి ని పరిశీలిస్తే ఈయనకి అపసవ్య దిశలో కాలసర్ప యోగం వున్నది. ఈ యోగం చాలా మంచి చేస్తుంది. 
లగ్నం లో వున్న యోగ కారకుడు, చతుర్థ నవమ స్థానాధిపతి కుజుడు  చాలా యోగం చేస్తాడు అదృష్ట కారకుడవుతాడు .  ఏకాదశాధిపతి బుధుడు ఏకాదశం లో నే ఉండడం మరో అదృష్ట కారక స్థితి. లగ్నాధిపతి రవి దశమం లో ఉండడం , ఉచ్చ స్థితి లో వున్న రాహువు తో అతి దగ్గిరగా ఉండడం  , వీరిద్దరికీ గురు దృష్టి ఉండడం ఆయన అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి కారణమైయ్యాయి అనొచ్చు .  కేతువు కూడా స్వస్థానం లో ఉండి  మనః కారకుడైన చంద్రుడి తో కలిసి ఉండడం ,చంద్రుడి నీచ స్థితి  ఈయనకి చంచలమైన మనః స్థితి కి కారణం అవుతున్నారు.
ఈయన జాతకం లో ని మరో ప్రత్యేకత సష్ట ,సప్తమాధిపతి ఐన శని లాభ  భావం లో సంధిలో ఉండడం, చాలా బలహీనం గా ఉండడం . సష్ట స్థానం అంటే శత్రు,రోగ,రుణ  స్థానం. అంటే శత్రువుల వల్ల ,రుణాల వల్ల ఈయనకి లాభం జరుగుతుందనేది సుస్స్పష్టం .   ఈయన మూడు నాలుగు సార్లు ఇన్సోల్వెన్సీ పిటిషన్ లు పెట్టి వున్న రుణాలు మాఫీ చేసుకున్నాడు.   క్రితం సారి ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ బలహీనతలు ఈయనకు బాగా కలిసివొచ్చి ప్రెసిడెంట్ గా గెలవడం జరిగింది .  ఈ సారి ఎన్నికలలో కూడా జరగబోయేది అదే . ఈయనని గెలవడం అసాధ్యం అని నా నమ్మకం .      రామాయణం లో ని వాలి మనకి తెలుసు . వాలి మెడలో ఒక హారం ఉంటుంది . ఆ హారం వల్ల  ఎదురుగా వున్న శత్రువు ఎవరైనా వారి బలం లో సగం వాలి కి వచ్చేస్తుంది . అది వాలికి వున్న వరం . డోనాల్డ్ ట్రంప్ గారి జాతకం లో శత్రు స్థానాధిపతి శని అతి బలహీనం గా ఉండడం ఈయనకి కూడా వాలి కి వున్న లాంటి వరం వుంది . ఈయనని మనం కలియుగ వాలిగా అనుకోవచ్చు .