Saturday, August 15, 2020

శకుంతల దేవి జాతకం - జన్మ లగ్నం 

 ఈ దిగువ ఇవ్వబడింది 'హ్యూమన్ కంప్యూటర్' అని పిలువబడే శకుంతలా దేవి గారి జాతక చక్రం. వికీపీడియా లో, గూగుల్ లో శోధించగా దొరికిన సమాచారం ప్రకారం ఈవిడ 4 నవంబర్ 1929 న బెంగళూర్ లో జన్మించారు. ఎంత వెతికినా ఈవిడ పుట్టిన సమయం ఇంటర్నెట్ లో ఎక్కడా దొరకలేదు.

అందుకే ఆ రోజు రాత్రి 9.30 గంటలు పుట్టిన సమయం గా తీసుకుని జాతక చక్రం తయారు చెయ్యబడింది. ఈ సమయం ఎందుకు తీసుకున్నానో చెప్పడమే ఈ పోస్టు ఉద్దేశ్యం.
శోధించగా తెలిసింది ఏమిటంటే ఈవిడ గణితంలో మేధావియే కాకుండా ఒక రచయిత అనీ, హోరా శాస్త్రం లో కూడా నిపుణురాలని. శకుంతలా దేవి గారికి ఉన్న ఈ లక్షణాలన్నీ బుధ కారకత్వాలే !!! అంటే ఈవిడ జన్మ లగ్నము బుధుడు అధిపతి అయిన రాశులలో ఒకటి అయ్యుండాలి. ఇదే కాక తెలివి తేటలని సూచించే పంచమ స్థానం ప్రత్యేకం గా , బలం గా ఉండాలి. అందుకు ఈవిడ జన్మ లగ్నం మిథునం ఐతే సరిపోతుందనిపించి అదే జన్మ లగ్నం గా తీసుకోవడం జరిగింది.
మిథునం జన్మ లగ్నం గా తీసుకున్న తరువాత శకుంతలా దేవి గారి జీవితం లో ని కొన్ని సంఘటనలు జాతక చక్రం తో సరిపోలుతున్నట్టు గా అనిపిస్తోంది. మిధున లగ్నానికి సప్తమం లో ఉన్న శనీశ్వరుడు ఈవిడ భర్త నుండీ విడాకులు తీసుకోవడం సూచిస్తోంది. లగ్నానికి పంచమం లో ఉన్న లగ్నాధిపతి బుధుడు మిత్ర రాశి లో ఉండడం, శుక్రుడి తో పరివర్తన లో ఉండడం , మరి మూడు గ్రహాలతో కలిసివుండడం, రాహు దృష్టి బుధుడిపై ఉండడం ఇవన్నీ పంచమ స్ధానానికి ప్రత్యేక బలాన్ని, పరమార్ధాన్నీ తెచ్చిపెడుతున్నాయి. పంచమం లోని గ్రహ సంయోగాలు ఈమెకు తీవ్ర బుద్ధి యోగం కలుగచేస్తున్నాయి.
గణితం మీద, జాతక శాస్త్రం మీదే కాకుండా ఈవిడ 'హోమోసెక్సువాలిటీ' ని బల పరుస్తూ ఆ రోజుల్లోనే ఒక పుస్తకం రచించారు. ఇది ఈవిడ లో ని ప్రత్యేక కోణం !!! ఈ ప్రత్యేకతే మనం ఈవిడ జాతకం తెలుసుకోవడానికి ఓ క్లూ కూడా !!!
ఒక కన్నడ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన ఈవిడకి ఇంత విప్లవాత్మకమైన ఆలోచనా ధోరణి ఎందుకు కలిగింది !!??? ఏ గ్రహం ఈవిడకి ఇలాంటి ఆలోచన కలిగించింది అని ఆలోచిస్తే ఒక ప్రత్యేకమైన గ్రహ స్థితి మనకి ఈవిడ జాతకం లో కనపడుతుంది !!! అది యురేనస్ గ్రహం చంద్రుడి నించీ పంచమం లో ఉండడం. మనం పరిశీలిస్తున్న జన్మ సమయానికి ఉన్న మిధున లగ్నానికి దశమం లో యురేనస్ ఉండడం.
వెస్ట్రన్ అస్ట్రోలోజర్స్ ప్రకారం యురేనస్ ( మనం ఇంద్ర గ్రహం అంటాము) పాత కాలపు సాంప్రదాయ పద్ధతులనీ, ఆలోచనా ధోరణులనీ ప్రశ్నించే గ్రహం. వీటిని మార్చేసే గ్రహం ఇది. ఈ గ్రహం చంద్రుడినించీ 5 లో(ఆలోచనలనీ, తెలివి తేటలని సూచించే స్థానం) , లగ్నంనించీ దశమం లో ఉండడం ఈవిడకి ఈ కొత్త తరహా ఆలోచనలు రావడానికి కారణ మైయ్యింది.
పైన చెప్పిన కారణాలతో శకుంతలా దేవి గారు రాత్రి 9.30 గంటలకు అటూ ఇటూ గా పుట్టి ఉంటారని నా నమ్మకం.